వరంగల్‌లో మాకు ఎదురులేదు, రూపురేఖలు మారతాయ్: హరీశ్ రావు
వరంగల్: వరంగల్ మహానగర పాలకసంస్థ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి కనీస పోటీ కరవైందని రాష్ట్రమంత్రి హరీశ్‌రావు అన్నారు. అక్కడక్కడా టిఆర్ఎస్ రెబల్స్‌తో మాత్రమే పోటీ నెలకొందని, అది కూడా పోలింగ్ నాటికి ఉండబోదని వివరించారు.
వరంగల్‌లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 58 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులంతా క్లీన్ స్వీప్ చేస్తారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పలు అంశాలపై మాట్లాడారు.
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపి వల్ల వరంగల్ ప్రాంతానికి జరిగిన మేలేమీ లేదని, 18 నెలల టిఆర్ఎస్ పాలనతోనే వరంగల్ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలకు బుద్ది చెబుతున్నారని అన్నారు.

హైదరాబాద్, నారాయణఖేడ్‌లలో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. అవే ఫలితాలు వరంగల్‌లో కూడా వస్తాయని ఆశిస్తున్నానన్నారు. హైదరాబాద్‌లో చెల్లని బిజెపి వరంగల్‌లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వరంగల్ నగరాభివృద్ధి సాధ్యమన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‌కు వన్నె తెచ్చింది కాకతీయులు, వారి పూర్వ వైభవాన్ని నిలబెట్టింది టిఆర్‌ఎస్ అని.. అందుకే టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల పునరుద్దరణ పనులకు కాకతీయుల పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
వరంగల్‌కు రెండు యూనివర్సిటీలను కేటాయించిన ఘనత టిఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. శిల్పారామం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను కేటాయించామని తెలిపారు. ఐటీ విస్తరణ కోసం ఇటీవలే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు.
వరంగల్ పేద ప్రజలపై భారం పడకుండా రూ.900 కోట్లతో 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించామన్నారు. జర్నలిస్టులకు కూడా హెల్త్‌కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. వరంగల్ నగరాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. పనిచేసే ముఖ్యమంత్రిని దీవించి వరంగల్ అభివృధ్దికి సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications