Srisailam: శ్రీశైలంకు భారీ వరద.. నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..
కృష్ణా బేసిన్ లో వరదలు కొనసాగుతోన్నాయి. కర్ణాటక నుంచి జూరాలకు భారీగా వరద వస్తోంది. దీంతో అంతే స్థాయిలో నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెకుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. జూరాలతో పాటు సుంకేసుల, తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు శ్రీశైలంకు చేరుతోంది. ప్రాజెక్టులోకి 4 లక్షల 12 వేలకు పైగా వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు 74,258 క్యూసెక్కుల నీటిని కిందికి వస్తోన్నాయి.
శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 866.40 అడుగుల మేరకు నీరు చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127.6 టీఎంసీల నీరు ఉంది. ఆల్మట్టి నుంచి మూడు లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 3,00,064 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నాయి.
జూరాలకు 3.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అటు తుంగభద్ర నుంచి 1,58,457 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిండితే.. నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. 3 రోజుల్లో నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గోదావరి బేసిన్ లో వరద ప్రవాహం భిన్నంగా ఉంది. శ్రీరాంసాగర్ కు వరద కొనసాగుతోంది. 20 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ కింది నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజుల కిందటి వరకు మేడిగడ్డ దగ్గర దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా శనివారం 5,39,200 క్యూసెక్కులకు తగ్గింది.
అదే సమయంలో సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ కు భారీగా వరద వస్తోంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications