నోరు కట్టుకొని...: మీటింగ్ ముగించాలన్న పోలీసులు, రేవంత్ రెడ్డి ఏం చేశారంటే?
హైదరాబాద్/మహబూబ్ నగర్: ప్రచారం సందర్భంగా ప్రసంగాన్ని త్వరగా ముగించాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పోలీసులు శనివారం నాడు సూచించారు. ఈ సమయంలో ఆయన వారితో ఫ్రెండ్లీగా మాట్లాడారు.
ఇది అందరినీ ఆకట్టుకుంది. మిత్రమా.. అయ్యా, పది నిమిషాలల్లో అయిపోగొట్టుకుంటా, మీ బాధ నాకు తెలుసు, నేనేం మిమ్మల్ని తప్పుబట్టను, మీ సమస్యలు మీవి అని తన ప్రసంగం ముగించమని చెప్పిన పోలీసులతో ఆయన చెప్పారు.

పోలీసు మిత్రులారా.. మీకు ఇవన్నీ జరిగాయా?
ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ, మా పోలీసులు మిత్రులు, ఇక వాళ్ల గురించే చెబుతానని వ్యాఖ్యానించారు. ఏఆర్ పోలీసులు, హోంగార్డులు, రిజర్వ్ పోలీసులు, స్పెషల్ బెటాలియన్లు, సివిల్ పోలీసులు.. ఇన్ని రకాలుగా ఉంటుందా, అందర్నీ కలిపి ఏక్ పోలీస్ చేస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని, వారు సంబరపడ్డారని కానీ అది జరగలేదన్నారు. పోలీసులు ఎక్కడకి వెళ్లినా రోజుల కొద్ది డ్యూటీ చేయాలని, 24 గంటలు పని చేయాలని, కాబట్టి వారి కుటుంబం పరిస్థితి ఏమిటని, కాబట్టి వారికి వారానికి ఓ రోజు సెలవు ఇస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ పోలీసులు అందుకు సంతోషించారని అది జరగలేదన్నారు. పోలీస్ స్టేషన్లు కూడా బాగా లేవని, బంగ్లాలు కట్టిస్తానని చెప్పారని, పోలీసులకు సొంత ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, పిల్లల్ని చదివిస్తానని చెప్పారని, కానీ ఏక్ పోలీస్ అయిందా, వారానికి ఓ సెలవు వచ్చిందా అని కేసీఆర్ పైన రేవంత్ మండిపడ్డారు.

ఎందుకయ్యా, ఇంకా కేసీఆర్‌కు కాపలా కాస్తారు
వినాయక చవితికి, రంజాన్ పండుగకు హైదరాబాదులో డ్యూటీ వేస్తే, రోడ్లపై పది పది రోజులు ఉంటే స్నానాలు చేయక డ్రాయర్లు కోసుకపోయిన పరిస్థితిలు ఉన్నాయన్నారు. పోలీసుల జీవితాలను బాగుపరచలేని కేసీఆర్‌కు ఎందుకయ్యా ఇంకా కాపలా కాస్తారని పోలీసు మిత్రులను ప్రశ్నించారు. ఆయనకు కాపలా కాయడం అవసరమా అన్నారు. నేను పోలీసులోళ్ల కుటుంబం నుంచి వచ్చానని రేవంత్ చెప్పారు. పోలీసోళ్ల కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. జేబులు కొట్టే చీటర్లకు కూడా మీరు కొట్టే పరిస్థితులు, బాధ నాకు తెలుసునని చెప్పారు. తెరాసలో ఒక్కడైనా చక్కనోడు ఉన్నాడా అన్నారు.

సన్నాసులకు సెల్యూట్ కొడుతుంటే
సన్నాసులకు సెల్యూట్ కొడుతుంటే పోలీసులకు దుఃఖం రావడం లేదా, బాధగా అనిపించడం లేదా, ఇంకా ఇలాంటి రాజ్యం కావాలా అని ప్రశ్నించారు. మీ ఉద్యోగాలు ఎటూ పోవని, కేసీఆర్ కాదు, ఆయన తాత వచ్చినా మీకు వచ్చే నష్టం లేదన్నారు. అందుకు నాది పూచీకత్తు అన్నారు. 25 రోజులు నిజాయితీగా పని చేయండని పోలీసులకు సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పోలీసోడి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానని పిల్లల చదువుల బాధ్యత నాది అన్నారు. మిలిట్రీ వాళ్లకు సైనిక్‌పురిలా మీకు ఉంటుందని చెప్పారు.

నోరుకట్టుకొని, బట్టలు మాసినా పని చేయండి
పోలీసులు ఈ 25 రోజులు మీ బడ్డల, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మీ బట్టలు మాసినా, నోరు కట్టుకొని పని చేయండని రేవంత్ పోలీసులకు సూచించారు. అప్పుడు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు నా బాధ్యత అన్నారు.

ఈసీ అధికారులు వేధించారని రేవంత్ రెడ్డి
నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంగా ఈసీ అధికారులు తనను వేధించారని రేవంత్ రెడ్డి వేరుగా సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌ను తెరాస కార్యాలయంగా మార్చేశారమన్నారు. ఈసీ అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివక్ష చూపుతున్నారన్నారు.
కాంగ్రెస్ నేత అరవింద్ రెడ్డికి ప్రగతి భవన్లో కేసీఆర్ తెరాస కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని, అలాగే దానం నాగేందర్‌కు మంత్రి కేటీఆర్ సైతం ప్రగతి భవన్లోనే బీఫామ్ ఇచ్చారన్నారు. ఇలా సీఎం నివాసాన్ని సైతం పార్టీ కార్యాలయంగా మార్చేశారన్నారు. కొడంగల్‌లో నామినేషన్ దాఖలు సందర్భంగా కొత్త కొత్త నిబంధనలు చెబుతూ ఈసీ అధికారులు తనను ఇబ్బంది పెట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాలకు టీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారన్నారు. ఈ సంఘటనలపై ఈసీ చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

రేవంత్ ఫౌజ్ పాటల సీడీ విడుదల
ఇదిలా ఉండగా, రేవంత్ రెడ్డి అభిమానులు రూపొందించిన రేవంత్ ఫౌజ్ ఆడియా సీడీని శనివారం తన నివాసంలో రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ పాటలను వినియోగిస్తారు.












Click it and Unblock the Notifications