Huzurabad : ఈటల రాజేందర్‌పై మంత్రి కొప్పుల సంచలనం-ఆ డ్రామాతో సానుభూతికి కుట్ర చేస్తున్నారంటూ...
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపించారు.అక్టోబర్ 12,13,14 తేదీల్లో టీఆర్ఎస్ నేతలు తనపై దాడి చేసినట్లుగా ఈటల ఒక డ్రామాను సృష్టించబోతున్నారని ఆరోపించారు. కాళ్లకు,చేతులకు కట్లు కట్టుకుని ఆయన కనిపించబోతున్నారని తెలిపారు.

సంజయ్,రఘునందన్ బాటలో సానుభూతి కోసం ఈటల : కొప్పుల
గతంలో బండి సంజయ్ గుండెపోటు వచ్చిందని నాటకం ఆడి గెలిచాడని, దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ రావు చేతికి కట్లు కట్టుకుని సానుభూతి సంపాదించారని, ఇప్పుడదే బాటలో ఈటల కూడా సానుభూతి కోసం ప్రయత్నించబోతున్నారని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.దీనిపై తనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని పాత్రికేయుల ముందు ఉంచుతున్నానని తెలిపారు. కాళ్లకు,చేతులకు కట్లు కట్టుకుని... తనకు దెబ్బలు తగిలాయంటూ ఊరూరా, ఇంటింటికీ తిరిగి ఈటల ఓట్లు అడుక్కోబోతున్నారని మండిపడ్డారు.బీజేపీ అంటేనే కుట్రపూరితమైన పార్టీ అని విమర్శించారు.

ఈటలకు ఈ ఉపఎన్నిక పెద్ద సవాల్...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.ఇక్కడ అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. నిజానికి ఉపఎన్నిక షెడ్యూల్ మరింత ఆలస్యమవుతుందని భావించినప్పటికీ... ఇటీవలే అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆరుసార్లు హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటలకు... ఈసారి ఉపఎన్నిక పెద్ద సవాల్‌గా నిలిచింది. టీఆర్ఎస్‌ను ఓడించి ఈటల విజయం సాధిస్తే ఆయన ఇమేజ్ మరింత పెరగనుంది.ఒకవేళ ఓడితే మాత్రం బీజేపీలో ఆయన ప్రాధాన్యత కోల్పోయే అవకాశం లేకపోలేదు. అందుకే రాజీనామా చేసిన కొద్దిరోజులకే ఈటల హుజురాబాద్‌లో వాలిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకూ హుజురాబాద్‌లోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈటలను ఢీకొడుతున్న గెల్లు...
మరోవైపు ఈటలపై అభ్యర్థి కోసం తీవ్ర తర్జనభర్జన పడిన టీఆర్ఎస్.. చివరకు విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. స్థానికుడు,ఉద్యమకారుడు,బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఈటలను గెల్లు ఢీకొట్టగలడని టీఆర్ఎస్ భావిస్తోంది. గెల్లు శ్రీనివాస్ తరుపున మంత్రి హరీశ్ రావు,ఇతర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక లక్ష్యంగా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంతో ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పొందవచ్చునని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే టీఆర్ఎస్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.
Recommended Video

ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్...
ఇప్పటికైతే హుజురాబాద్ గ్రౌండ్‌లో పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే కనిపిస్తోంది.కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మాజీ మంత్రి కొండా సురేఖ,కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరుల పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తోంది. అయితే తొలి నుంచి కాంగ్రెస్ హుజురాబాద్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి ఇంతవరకూ అక్కడ అడుగుపెట్టనే లేదు.అడపాదడపా దామోదర రాజనర్సింహ తప్ప కాంగ్రెస్ అగ్ర నేతలెవరూ అటువైపు వెళ్లలేదు. టీఆర్ఎస్,బీజేపీలు హుజురాబాద్‌పై ఫోకస్ చేసిన సమయంలో... కాంగ్రెస్ మాత్రం దళిత,గిరిజన దండోరా పేరుతో నిర్మల్,గజ్వేల్ తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించింది. దీనిపై సొంత పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జగ్గారెడ్డి లాంటి నేతల నుంచే విమర్శలు వచ్చాయి. హుజురాబాద్ అభ్యర్థిని వెంటనే ప్రకటించాలని గతంలో వారు డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికీ అభ్యర్థి ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించట్లేదు.












Click it and Unblock the Notifications