హైదరాబాద్ శేరిలింగంపల్లిలో దారుణం: భార్యాపిల్లలను చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని శేరిలింగంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యా పిల్లలను హత్య చేసి, అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నాగరాజు అనే వ్యక్తి పాత ఇనుప సామాగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తన భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా వాళ్ల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో అదే రాత్రి భార్యతోపాటు కుమారుడు సిద్ధార్థ, కుమార్తె రమ్యశ్రీలపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నాగరాజు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా తలుపులు మూసి ఉండటం.. ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించారు స్థానికులు.
ఈ నేపథ్యంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. ఆ కుటుంబమంతా విగత జీవులుగా పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications