గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలోనే హైడ్రా: చట్టబద్ధతపై రంగనాథ్
జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని ఇది చట్టబద్ధమైనదే అని తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పారు.
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రానుందని రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని అన్నారు.ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరహాలోనే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్‌తో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్నారు. మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లపైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారని.. వాటి పరిధిలోని భూములను కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని రంగనాథ్ తెలిపారు.
ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయని, అందుకు చట్టాలు కూడా ఉన్నాయన్నారు కమిషనర్ రంగనాథ్. కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాలను కూడా వదిలిపెట్టబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాంటి నోటీసులు, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది.
జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు.
జీహెచ్ఎంసీకి యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని తెలిపారు. జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని.. కానీ, ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించారు.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌లో సెప్టెంబర్ 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా.. కూల్చివేశారని తెలిపారు. వాదనల అనంతరం ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications