బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గుడ్‌బై: రేవంత్‌తో భేటీ, కాంగ్రెస్‌కు తిరుపతి రెడ్డి షాక్
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి(BRS)కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని, తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఆదివారం ఉదయమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ జడ్పీ వైఎస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఇది ఇలావుండగా, మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
One more wicket down in BRS Telangana.
— Asma (@asmatasleem13) October 1, 2023
MLC Kasireddy Narayana Reddy resigned from BRS..!
He sent his resignation letter to CM KCR and met TPCC President Revanth Reddy. pic.twitter.com/MofTxy5ARy
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తనకు ఎమ్మెల్యే టికెట్ రాదనే ఆలోచనతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరతారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ పార్టీలోని అసంతృప్తులు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలోని అసంతృప్తులు ఆ పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఆయా పార్టీలకు చెందిన నేతలు చేరికలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications