సారీ చెప్పాలని స్లిప్: జానాకు ఉత్తమ్ కుమార్ క్లాస్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి పట్ల ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జానా రెడ్డి అధికార పక్షపాతిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆయన తీరు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు రుచించలేదు.
జాతీయ గీతం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు బెంచీలు ఎక్కి నిరసన తెలిపారని, ఇది సరికాదని, ఇందుకు వారు క్షమాపణలు చెప్పాలని ఆధికార తెరాస డిమాండ్ చేసింది. జాతీయ గీతం ఆలపించే ముందు అధికార పార్టీ ప్రకటన చేయలేదని కాంగ్రెస్, టీడీపీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన పదిమంది సభ్యులను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కూడా సస్పెండ్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, జానా రెడ్డి ఓ స్లిప్‌లో.. క్షమాపణలు చెప్పమని రాసి పంపించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, సంపత్ కుమార్ సభకు కొత్త అని జానా రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మనది తప్పులేకున్నప్పటికీ క్షమాపణలు చెప్పాలని జానా స్లిప్ పంపించడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని తెలుస్తోంది.

కాగా, అంతకుముందు జానా రెడ్డి సభలో మాట్లాడుతూ.. స్పీకర్‌తో జరిగిన సమావేశంలో చూపించిన క్లిప్పింగ్స్ సరిగాలేవని అన్నారు. సభలో జాతీయగీతాన్ని అవమానపర్చిన సభ్యులు సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సభలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దమ్ముంటే వీడియో ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సభలో ఉద్దేశ్యపూర్వకంగా జాతీయ గీతాన్ని అవమానించలేదన్నారు. జాతీయ గీతం పాడటానికి ముందు ప్రకటన చేయాలని, కానీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని తెరాసకు హితవు పలికారు.
జానాకు ఉత్తమ్ క్లాస్
జానారెడ్డికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించడంపై స్పందించిన ఆయన జానారెడ్డి వివరణ తీసుకున్నారు. అదేవిధంగా సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో మెతకవైఖరిని వీడాలని సూచించారు.












Click it and Unblock the Notifications