హైదరాబాదుతో జయకు 40 ఏళ్ల అనుంబంధం: విలాసవంతమైన భవనం
జయలలితకు హైదరాబాదుతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఆమెకు హైదరాబాదులో విలాసవంతమైన భవనం ఉంది. అప్పుడప్పుడు జయ ఆ నివాసంలో బస చేసేవారు.
చెన్నై: పలు తెలుగు సినిమాల్లో నటించిన జయలలితకు హైదరాబాదుతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఆమెకు హైదరాబాదు నగరంలోని కొంపల్లిలో విలాసవంతమైన భవనం ఉంది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడ విడిది చేసేవారు. దానిపేరు జయా గార్డెన్స్.
ఆ భవనం ఆమె ప్రియసఖి శశికళ పేరు మీద ఉంది. ఆస్తుల కేసు నడుస్తున్న క్రమంలో ఆమెకు హైదరాబాదులో గల ఆస్తులపై కూడా చర్చ సాగింది. బోయిన్‌పల్లి సమీపంలోని పేట్ బషీరాబాదులో ఆమె 1970ల్లోనే 15 ఎకరాల స్థలాన్ని జయలలిత కొనుగోలు చేసినట్లు చెబుతారు. సినీ రంగంలో ఉన్నప్పుడే దాన్ని కొనుగోలు చేశారు. దాదాపు 12 ఏళ్ల క్రితం చివరిసారిగా ఆమె ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు.

ఆమె హైదరాబాదు వచ్చినప్పుడు మారేడుపల్లిలోని రాధికా కాలనీలో గల ప్లాట్ నెంబర్ 16లో నివసించేవారని చెబుతారు. ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ నేమ్ ప్లేట్ దానికి ఉండేది. కానీ చాలా కాలంగా ఎవరూ ఆ ఇంట్లో నివసించడం లేదు. ఆ ఇంట్లో కొన్నేళ్లుగా ఎవరూ ఉండడం లేదు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి బూత్ బంగళాగా మాదిరిగా మారిపోయింది.
అలాగే జీడిమెట్ల సమీపంలో గల జయలలిత గార్డెన్ పేరుతో ఉన్న భూముల చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీగోడ నిర్మించారు. జాతీయ రహదారి ముందు ప్రధాన గేటు, జీడిమెట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రం సమీపంలో మరో గేటు ఏర్పాటు చేశారు.
అందులో పనిచేస్తున్నావారంతా తమిళనాడుకు చెందినవారే. స్థానికులను లోపలికి అనుమతించరు. మూడు కుటుంబాలు ఇందులో ఉండి గార్డెన్ పరిశీలిస్తున్నట్లు అప్పట్లో చెప్పేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సార్లు, ఓడిన తర్వాత ఒక్కసారి జయలలిత ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు చెబుతారు.












Click it and Unblock the Notifications