సహకరించండి: జైట్లీతో కెసిఆర్, తెలంగాణకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీ!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సమావేశమయ్యారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు, కేంద్ర సాయం, కేంద్ర పథకాల్లో వాటా అంశంపై జైట్లీతో చర్చించారు. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. జైట్లీతో భేటీలో.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్ భేటీ కానున్నారు.

తెలంగాణకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీ?
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి కింద కేంద్రం నుంచి త్వరలోనే నిధులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన చెరువుల పునర్నిర్మాణం, జలహారంలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు పంపాల్సిందిగా ప్రభుత్వానికి నీతి ఆయోగ్ తాజాగా సూచించింది.
ఉభయ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే భౌతిక, సామాజిక మౌలిక వసతుల కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) తెలియజేస్తోంది. దీనికి అనుగుణంగానే తమకు రూ.56,646 కోట్లు కావాలని తెలంగాణ ప్రభుత్వం తొలుత నివేదిక పంపింది.
అయితే, కేంద్రం సూచనలతో దాన్ని రూ.31వేల కోట్లకు కుదించి రెండోసారి నివేదికను పంపింది. చెరువుల పునర్నిర్మాణం (మిషన్ కాకతీయ)కు రూ.20వేల కోట్లు, వాటర్ గ్రిడ్‌కు రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వెనుకబడిన ఏడు జిల్లాల్లో చేపట్టే ఈ రెండు కార్యక్రమాలకు ఈ సొమ్మును ఏడాదికి రూ.7,750 కోట్ల చొప్పున ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రధాన మోడీకి అందజేసిన నివేదిక గత రెండు నెలలుగా నీతి ఆయోగ్‌లోనే ఉంది.












Click it and Unblock the Notifications