వివాహేతర సంబంధం చూశాడని.. ఆ బాలుడ్ని ఏం చేశారంటే..?
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఇలాంటి వ్యవహారాలు బయట పడినప్పుడు పరువు, గౌరవం పోతుందని కొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలా ఆ కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగుల్చుతున్నారు. క్షణికావేశంలో వాళ్లు తీసుకున్న నిర్ణయాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. అయితే తాజాగా ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధాన్ని చూశాడని పదోతరగతి బాలుడ్ని ఆ కామ పిశాచులు దారుణంగా హతమార్చాయి. తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు చెబుతాడన్న భయంతో మహిళ, ఆమెతో సంబంధం ఉన్న యువకుడు కలిసి బాలుడికి కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపి తాగించి హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది..?
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలో అపర్ణ అనే మహిళ తన భర్తతో విడిపోయి అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్ది కాలానికే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల అపర్ణ, అజయ్ కలిసి ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన జిల్లెళ్ల రవి (15) అనే పదో తరగతి విద్యార్థి చూశాడు. ఆ తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని వారిని హెచ్చరించాడు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో అజయ్- అపర్ణ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు గత నెల 24 న గ్రామ శివారు పరిసరాల్లోకి రవిని పిలిపించారు. అక్కడే ఆ బాలుడికి కూల్ డ్రింక్ లో కలుపు మందు కలిపి తాగించారు. ఆ తర్వాత బాలుడి ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంతో నిందితులు భయపడి ఈ విషయాన్ని బయటపెట్టారు. దాంతో బాలుడి కుటుంబ సభ్యులు అక్టోబర్ 25న రవిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి అజయ్- అపర్ణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. చిన్న వయసులోనే రవి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications
