చెప్పాల్సింది చెప్పేశాం- బంతి ఇక బీజేపీ కోర్ట్‌లో: తేల్చేసిన కోమటిరెడ్డి, ఈటల
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు సానుకూలంగా పరిణమించినట్లు భావిస్తోన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. ఇది కాస్తా పార్టీ అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

కొందరు కీలక నేతలు సైతం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సొంత నిర్ణయాలతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని దిగజార్చుతున్నట్లు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను చులకన చేస్తున్నారని, తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారని, ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బండి సంజయ్.. ఏకపక్షంగా వ్యవహరిస్తోండటం పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాలపై తమకు ఎలాంటి సమాచారం ఉండట్లేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను బండి సంజయ్ ముందుచూపు లేమి వల్ల కోల్పోవాల్సి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల.. జేపీ నడ్డా ముందు స్పష్టం చేశారని అంటున్నారు. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవకాశాలను పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.
జేపీ నడ్డాతో మాత్రమే కాకుండా.. కోమటిరెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాము పార్టీ మారుతామంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని, తెలంగాణ ప్రజలను గందరగోళంలో నెట్టేయడానికి కొన్ని శక్తులు చేస్తోన్న ప్రచారంగా కొట్టి పారేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నామని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications