కొండా Vs పొంగులేటి, టెండర్ వార్- ఢిల్లీకి చేరిన పంచాయితీ..!!
తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు పెరుగుతున్నాయి. మంత్రులు.. నేతల శైలి పార్టీకి సమస్యగా మారుతోంది. తాజాగా మంత్రులు పొన్నం వర్సస్ లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం పార్టీ నేతల జోక్యంతో సమిసిపోయింది. ఇప్పుడు మంత్రి పొంగులేటి లక్ష్యంగా మరో మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటంతో పాటుగా నేరుగా పార్టీ చీఫ్ కు లేఖ రాసారు. ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది.
రేవంత్ కేబినెట్ లోని మంత్రుల్లో సమన్వయం లోపిస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ .. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కొండా సురేఖ తన సహచర మంత్రి పైన ఫిర్యాదు చేసారు. మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవద్దని కొండా సురేఖ వారిస్తూ వస్తోంది.

కానీ పొంగులేటి మాత్రం ఎక్కడా తగ్గకుండా తన పనులు తాను చేసుకుంటూ వెళ్లి పోతున్నారు. దేవాదాయ శాఖకి సంబంధిచిన రూ 71 కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపణ. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు సంబంధం లేకుండా పొంగులేటి జోక్యం చేసుకోవటం పైన సురేఖ ఆగ్రహంతో ఉన్నారు.
దీంతో, మంత్రి పొంగులేటితో తమకు ఇబ్బందిగా ఉందని కొండా మురళీ అధిష్ఠానానికి లేఖ రాసారు. ఇక.. ఇప్పుడు పొంగులేటిపై స్వయంగా సీఎం రేవంత్ ను కలిసి కొండా సురేఖ ఫిర్యాదు చేయటం కీలకంగా మారుతోంది. ఈ వ్యవహారం పైన పొంగులేటి స్పందించలేదు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పొంగులేటి వ్యవహరిస్తున్నారని.. టెండర్ల విషయంలో జోక్యం చేసుకోలేదని వారి వాదన. పొంగులేటికి పార్టీలో తనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కొండా సురేఖ జీర్ణించుకోలేక ఈ వివాదాలు తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దేవాదాయ శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడం పట్ సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై సురేఖ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసారు. అలాగే ఢిల్లీ వెళ్లి ఖర్గేను కలవనున్నారు. దీంతో, ఈ వివాదం ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications