నీట్ పేపర్ లీక్: ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పిన కేటీఆర్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నా ప్రధానమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి పొంతన లేకుడా ఉన్నాయని ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా, మోడీ ప్రభుత్వం జులై ఆరో తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ధ్వజమెత్తారు. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

జూన్ నాలుగో తేదీన నీట్- యూజీ పేపర్ లీక్ అయిందని, జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దయిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జూన్ 21న సీఎస్ఐఆర్- యూజీసీ- నెట్ పరీక్ష వాయిదా పడగా, జూన్ 22న చివరి నిమిషంలో నీట్- పీజీ పరీక్ష వాయిదా పడిందని తెలిపారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్- పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని, ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
It’s truly an unfortunate turn of events for the students shattering their academic careers
— KTR (@KTRBRS) June 24, 2024
❌ June 4 : NEET-UG paper leak
❌ June 19: UGC-NET cancelled
❌ June 21: CSIR-UGC-NET postponed
❌ June 22: NEET-PGT postponed in the last minute
The BJP-led NDA government's…
అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్ ( ఎన్డీయే ) అని కేటీఆర్ విమర్శించారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రప్రభుత్వానికి కేటీఆర్ ఇప్పటికే లేఖ రాశారు. మరోవైపు, నీట్ పరీక్ష లీకేజీపై కాంగ్రెస్ సహ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిరసనలు చేపడుతున్నాయి. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications