హైదరాబాద్ రూపు రేఖలు ఇలా మారబోతోన్నాయ్..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. అక్టోబర్ 10వ తేదీ నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. ఆ వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.
ఈ పరిస్థితుల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి.. కొత్త కొత్త ప్రాజెక్టులను తెర మీదికి తీసుకొస్తోంది. లక్షలాది మంది హైదరాబాద్‌వాసులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి కసరత్తు పూర్తి చేసింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకుని రానుంది.

ఇందులో భాగంగా- హైదరాబాద్‌లో కొత్తగా అయిదు వంతెనలను నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అయిదు వంతెనల నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ నెల 25వ తేదీన అంటే సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి చురుగ్గా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాటి నిర్మాణ వ్యయం 139 కోట్ల రూపాయలు.

రెండు వంతెనలు బుద్వేల్ ఐటీ పార్క్ సమీపంలో నిర్మితం కానున్నాయి. ఈసా నదిపై వీటిని నిర్మించనుంది కేసీఆర్ సర్కార్. మూసీకి ఉపనది ఈ ఈసా. మూడో వంతెన- మూసీ నది మీద రాబోతోంది. మంచిరేవుల వద్ద దీన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. నాలుగోది- ఉప్పల్ భగాయత్ వద్ద అందుబాటులోకి రానుంది. హెచ్‌ఎండీఏ లేఅవుట్ వద్ద ఇది నిర్మితం కానుంది.

అయిదో బ్రిడ్జి- ప్రతాపసింగారం వద్ద రూపుదిద్దుకోనుంది. దీన్ని కూడా మూసీ నది మీదే నిర్మించనుంది ప్రభుత్వం. సోమవారం కేటీఆర్- ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్‌లో ఈ అయిదు వంతెనల నిర్మాణానికీ శంకుస్థాపన చేయనున్నారు. 15 నెలల కాల వ్యవధిలో ఈ అయిదు వంతెనలు 15 నెలల కాల వ్యవధిలో వాహనదారుల కోసం అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications