‘రాజేష్‌ది కుల దురహంకార హత్య: నిందితులను వెంటనే అరెస్టు చేయాలి’
కమలాపూర్: కులాంతర ప్రేమను సహించలేకనే ఇనుగాల రాజేష్‌ను హత్య చేశారని నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. గ్రామానికి చెందిన ఇనుగాల రాజేష్ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా, గత నెలలో జమ్మికుంట శివారులోని ఓ బావిలో శవమై తేలిన విషయం విధితమే.
కాగా నిజనిర్ధారణ కమిీ మర్రిగూడెం గ్రామానికి రాత్రి విచ్చేసి రాజేష్ తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో దళిత కులస్తుడిని అగ్రకులాలు హత్య చేశాయని, హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంలేదని ఆరోపించారు.
మంథనిలో మధుకర్, మర్రరిపల్లిగూడెంలో రాజేష్‌ల హత్యలు చూస్తే దళితులపై ప్రభుత్వం, పాలకులు, పోలీసులు, అగ్రకులాలు దాడులు చేస్తున్నాయని అనడానికి నిదర్శనమన్నారు. రాజేష్‌ను హత్య చేసినవారిలపై కేవలం సీఆర్‌పీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదుచేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
వరంగల్: హన్మకొండ బొక్కలగడ్డ సమీపంలో ఎస్‌కె. యూకూబ్ పాష (37) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. హన్మకొండ సిఐ సంపత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... బొక్కలగడ్డలో నివాసం ఉంటున్న యాకూబ్ పాష కొంత కాలంగా ఆటో నడుపుకుంటూ కటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
కాగా, ఇటీవల అప్పులు ఎక్కువ కావడం, పిల్లల పోషణ ఇబ్బందిగా మారడంతో మానసికంగా కృంగిపోయాడు. దీంతో మంగళవారం రాత్రి సమారు 12 గంటల సమయంలో ఇంట్లో అందరూ పడుకోగా ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రలేచి చూసే సరికి తండ్రి మృతి చెంది కనిపించడంతో పిల్లలు బిగ్గరగా అరిచి భయానికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మంగళవారం గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగలు పంజా విసిరారు. నగరంలో ఒకే రోజు రెండు ప్రదేశాల్లో 75 గ్రాముల బంగారం అపహరించారు. మరో రెండు ప్రదేశాల్లో చోరీకి యత్నించారు. దీనిపై బాధితులు సుబేదారి, కాజీపేట పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ నగరంలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కక్కెర్ల విజయలక్ష్మి అనే మహిళ వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లింది.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు. మేము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. పక్క వీధిలో ఉన్న గుడివద్ద మహిళను దొంగలు హత్యచేసి బంగారం లాక్కున్నారని, నీ బంగారం దాచుకోమని ఆమె దృష్టిని మళ్లించారు. అంతుకు ముందే వారి వద్ద ఉన్న రోల్డ్‌గోల్డ్ వస్తువులను కూడా తన వద్దనే ఉంచమని చెప్పారు. అప్పటికే విజయలక్ష్మి వద్ద ఉన్న 4 బంగారు గాజులు, పుస్తెల తాడు (60)గ్రాములు తీసి కవర్‌లో భద్రపర్చుకుంది.
మాటల్లో పెట్టిన ఇద్దరు వ్యక్తులు ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని నకిలీ వస్తువులను చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. తీరా కొంత సేపటికి చూసే సరికి అసలు మాయమై నకిలీవి మిగలడంతో బోరుమంది. మోసపోయానని గమనించి పోలీసు స్టేషన్‌కు పరుగులు తీసింది. అలాగే కాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలో తోట సుజాత అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాలకుర్తి మండలంలో పనిచేస్తోంది.
బాపూజీ నగర్‌లో ఉంటూ సమీపంలో ఉన్న కడిపికొండ బస్‌స్టేషన్ వద్ద ప్రతీరోజు మాదిరిగానే బస్సెక్కి వెళ్తోంది. కాగా, మంగళవారం ఉదయం బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు సుజాత మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. అదే విధంగా సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోట్ల మహిళలపై చైన్‌స్నాచింగ్ యత్నం జరిగింది.












Click it and Unblock the Notifications