మానుకోట జెడ్పీ సమావేశంలో బీఆర్ఎస్ రచ్చ; టార్గెట్ మంత్రి సత్యవతి రాథోడ్!!
రాష్ట్రవ్యాప్తంగా అధికార బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజుకో చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య రగడ చోటు చేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ నియోజకవర్గ జెడ్పిటిసిలు నిరసన గళాన్ని వినిపించారు.
మహబూబాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసభసగా సాగింది. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ జెడ్పిటిసిలు, జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పీ ఫ్లోర్ లీడర్లు సమావేశంలో కింద కూర్చొని నిరసన తెలియజేశారు. జెడ్పీ నిధులన్నీ జెడ్పి చైర్ పర్సన్ బిందు తన మండలానికి మళ్ళించుకుపోతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మహబూబాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో నిప్పులు చెరిగిన జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టలేదని, నిధులు లేవని, జెడ్పిటీసీల సమస్యలను పట్టించుకునేవారు అని లేరు అంటూ జెడ్పీ చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నూకల వెంకటేశ్వర రెడ్డితో పాటు తొర్రూరు , మరిపెడ, గూడూరు జెడ్పిటిసిలు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ముఖ్యంగా జెడ్పీ చైర్ పర్సన్ బిందు మంత్రి సత్యవతి రాథోడ్ వర్గం కావడంతో, ఆమెను టార్గెట్ చేయడం వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయి అని చర్చ జరుగుతుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం లోని జెడ్పిటిసిలు తమ నిరసన గళం వినిపించడంతో దీని వెనుక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారా? అన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మొదటినుంచి ఉప్పు నిప్పులా సత్యవతి రాథోడ్ కు రెడ్యా నాయక్ కు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. జెడ్పీ సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గం కూడా ఆందోళనకు దిగడంతో మంత్రి సత్యవతి రాథోడ్ ను టార్గెట్ చేయడానికే అన్నది ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఏదేమైనా ఇప్పటికే అనేకసార్లు మహబూబాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడగా, మళ్లీ తాజాగా జెడ్పీ సమావేశం రసాభాస కావడంతో మరోమారు చర్చనీయాంశం అయింది. అధిష్టానం మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులను కలపాలని ఎంత ప్రయత్నం చేసినా అనేక సందర్భాలలో వారి మధ్య విబేధాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications