ఐదుసార్లు అవమానించినా భరించాం; కేంద్రానిది కండకావరం: మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి
ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటానికి తెలంగాణా మంత్రుల బృందం ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రుల బృందం సీఎం కేసీఆర్ ను కలిసి ఢిల్లీలో జరిగిందంతా ఆయనకు వివరించారు. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంత్రులు కేంద్రం పై పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు బిజెపి సర్కార్ ను వదిలిపెట్టేది లేదని వెల్లడించారు. కేంద్రానికి ఏప్రిల్ రెండో తేదీ ఉగాది వరకు డెడ్ లైన్ పెట్టామని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని తేల్చి చెబుతున్నారు.

పీయూష్ గోయల్ ను కలిస్తే ఐదు సార్లు అవమానించినా భరించాం : మంత్రి గంగుల కమలాకర్
ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ సూచనల మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిస్తే ఐదు సార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి కూడా ఒక్కసారైనా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడారా అంటూ గంగుల కమలాకర్ ప్రశ్నించారు. మెడ మీద కత్తి పెడితే రైతుల ప్రయోజనాల కోసం బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసి ఇచ్చామని, కేంద్రం కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

కేంద్రానికి ధాన్యం కొనుగోలు కోసం 16 సార్లు లేఖలు రాశాం: మంత్రి గంగుల
కేంద్రానికి ధాన్యం కొనుగోలు విషయంలో పదహారు సార్లు లేఖలు రాశామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదని వెల్లడించారు. నెలకు పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి పంపగలము .. తీసుకెళ్లాలంటే మా దగ్గర నిల్వ చేసుకోవడానికి ర్యాకులు లేవంటూ చెప్పారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. రైతులను ఆదుకోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికైనా ప్రయత్నం చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు నూకల బియ్యం అలవాటు చెయ్యమని కేంద్రమంత్రి అవమానం: వేముల ప్రశాంత్ రెడ్డి
ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మమ్మల్ని ఘోరంగా అవమానించారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వెల్లడించారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ దాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రమంత్రి అవమానకర ధోరణిలో మాట్లాడారంటూ మండిపడ్డారు. రా రైస్ ఇవ్వాలంటే నూకలు అవుతాయని చెప్పామని, అయితే తెలంగాణ ప్రజలకు నూకల బియ్యం అలవాటు చేయమని చెప్పారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రికి ఎందుకు అంత కండ కావరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీయూష్ గోయల్ కు కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది: వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వమని అన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి పట్టిన గతే పీయూష్ గోయల్ కు కూడా పడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్ కు ధైర్యముంటే కేంద్రంతో వడ్లు కొనిపించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.రానున్న రోజుల్లో రైతులతో కలిసి తెలంగాణా ప్రభుత్వం పోరుబాట పడుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications