'రేవంత్ మరో కేజ్రీవాల్ అవుతారనే కుట్ర', 'కేంద్రం జోక్యం చేసుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మరో కేజ్రీవాల్ అవుతారని ప్రజలు అనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. రేవంత్ రెడ్డి కుర్రాడు, ఓ కుర్రాడ్ని కేసీఆర్ తట్టుకోలేకపోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నారు.
తాజాగా, ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రేవంత్ మరో కేజ్రీవాల్ అవుతారని ప్రజలు అనుకుంటున్నారని, అది ఓర్వలేక టీఆర్ఎస్ ఆయన పైన కుట్ర పన్నిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం కేసీఆర్‌కు లేదని మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి చిత్తూరులో అన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడంలో గవర్నర్ విఫలమయ్యారని, ఉద్యమాల పేరుతో కోట్లు దండుకున్న కేసీఆర్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.

ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నారు: సుధీర్ రెడ్డి
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు పరస్పర ఆరోపణలతో ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. రెండు ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలన్నారు.
కేసీఆర్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కూతురుకు మంత్రి పదవి కోసం ఎన్డీయేతో జత కట్టాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications