బుర్కాలు, చీరలు వేసుకుని స్త్రీలా: గుట్టల్లో దాక్కుని చిక్కాడు
హైదరాబాద్: కరుడు గట్టిన నేరస్తుడిని హైదరాబాదులో పోలీసులు పట్టుకున్నారు. హత్యలు, సెటిల్‌మెంట్లు చేయడం, వ్యాపారులను భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతూ అరాచకాలు చేస్తున్న బిల్డర్ చాంద్‌ను పథకం ప్రకారం పోలీసులు పట్టుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ 40 మంది బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. గాలిలో కాల్పులు జరపడంతో తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఎట్టకేలకు చిక్కాడు.
కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా నేరాలను కొనసాగిస్తున్న చాంద్ పహిల్వాన్ అలియాస్ బిల్డర్ చాంద్ గతంలో పోలీసులపై కూడా తల్వార్లతో దాడి చేశాడు. అతని గురించి ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే చంపడానికి కూడా వెనకాడడు. బయట తిరిగే సమయంలో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మహిళలు వేసుకునే బుర్కాలు, చీరలతో సంచరిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.
ఇతనిపై వెస్ట్‌జోన్ పరిధిలో 40 వరకు కేసులు నమోదై ఉన్నాయి. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల క్రితమే రౌడీషీట్ నమోదై ఉంది. వెస్ట్‌జోన్ పరిధిలోని అసీఫ్‌నగర్, గోషామహల్, మంగళ్‌హాట్, టప్పాచబుత్ర ఠాణాల పరిధిలో ఇతడు తన కార్యకలాపాలను విస్తరించాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నగర పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపడంతో పాటు పీడీ యాక్టులు నమోదు చేస్తుండడంతో అజ్ఞాతంలో ఉంటూ సెటిల్‌మెంట్ల దందాను కొనసాగిస్తున్నాడు. ఇతడు 20 మంది వరకు అనుచరులను ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు బెదిరింపులు చేస్తూ వసూళ్లకు పాల్పడ్డాడు. అలాబండ, దత్తత్రేయనగర్ పహాడ్ ప్రాంతంలోని గుట్టల్లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇరవై ఏళ్ల నుంచే పహిల్వాన్‌గిరి చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇలా హత్యలు, హత్యా యత్నాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కిడ్నాప్‌లు చేస్తూ నేరాల్లో మునిగితేలాడు. కొన్ని కేసులలో పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టులకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ తన నేరాలను కొనసాగిస్తున్నాడు. పోలీసులకు పట్టుబడ్డా వారి చేతిలో నుంచి తప్పించుకొని పాములా పారిపోతుంటాడు.

పోలీసుల చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు కాల్పులు జరిపినా, ఒక బుల్లెట్ కూడా తగలకుండా పరారయ్యాడు. ఇతని ప్రత్యర్థులు గతంలో మద్యంలో విషం కలిపి తాగించినా బతికి బయటపడ్డాడు. ప్రతి నిత్యం జెంబ్య(మరణాయుధం) పెట్టుకొని తిరుగుతాడు. ఎవరైనా వ్యాపారి దగ్గర వసూళ్లకు వెళ్తే ముందుగా జెంబ్యను టేబుల్‌పై పెట్టి మాట్లాడం అతని మర్యాద.
పగటి వేళల్లో కూడా తిరగడానికి కష్టంగా ఉండే అలాబండ, దత్తత్రేయనగర్ గుంటల్లో చిమ్మ చీకట్లో గుట్టలను కలియ తిరుగుతాడు. గుట్టలపై పూర్తి అవగాహన ఉండడంతో వాటినే తన స్థావరంగా చేసుకున్నాడు. సుమారు 15 నెలలుగా ఇక్కడే ఉంటున్నట్లు తెలిసింది. ఇతడికి స్థానికులలో కొందరి నుంచి ఆధరణ ఉండడంతో షెల్టర్ ఇస్తుంటారు.
ఎవరైనా సమాచారం పోలీసులకు ఇచ్చారంటే దాడి జరుగుతుంది.15 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనలు జరగడంతో స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బయటపడేవారు. ఇలా ప్రజలను ఒక పక్క భయబ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు.
తాము దృష్టి పెట్టినా చాంద్ పోలీసుల ముందు నుంచే పలుమార్లు బుర్కా వేసుకొని వెళ్లినట్లు తెలిసింది. కొందరు వ్యాపారులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అతన్ని పట్టుకోవడానికి పక్కా వ్యూహరచన చేశారు.
ఇందుకు టాస్క్‌ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. రాత్రి వేళల్లో పోలీసులు చాంద్ ఉన్న గుట్టల్లోకి ప్రవేశించి గాలింపు చేపట్టారు. అయితే అతడు ఉండే స్థావరంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన ఆచూకీ తెలియకపోవడంతో, పోలీసులు గాలిల్లోకి కాల్పులు జరిపారు. ఏదో జరుగుతుందని భావించిన చాంద్ మొదటి బృందం కళ్లు గప్పి పరారవుతూ రెండో బృందానికి చిక్కాడు.












Click it and Unblock the Notifications