ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ది అంటే ఏంటో చూపిస్తాం - ప్రియాంక గాంధీ..!!
కాంగ్రెస్ అదికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల స్వప్నం నెరవేరలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారతాయని ఉద్యమకారులు కలలు కన్నారని, యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటే : నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ విజయభేరీ బహిరంగసభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ధరణి పోర్టల్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఇలాంటి ధరణిని బంద్ చేసి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. బీజేపీ పెద్ద కంపెనీల దోస్తాతో దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు.

దేశంలో మోడీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటుగా స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు ఒక్కటే.. పక్కపక్కనే ఉంటూ నాటకాలు వేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఉద్యమకారుల కటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
మోదీ మౌనం దేనికి : తెలంగాణలో జరిగే అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు పెద్దలకే రుణమాఫీ చేస్తారని, రైతులు, కార్మికుల రుణాలను మాత్రం మాఫీ చేయదని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ వైఫల్యం వల్లే యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రియాంక అన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ కే తెలుసు : ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్‌కు తెలుసునని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి రాగానే పక్కా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. 10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు యువ వికాసం స్కీం తీసుకొస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలంగాణలో అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని ప్రియాంక ఓటర్లను అభ్యర్దించారు.












Click it and Unblock the Notifications