అసెంబ్లీ: రేవంత్ రెడ్డికి హరీశ్ జవాబు, అక్బరుద్దీన్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజూ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను చేపట్టడంలో పలువురు సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజూ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను చేపట్టడంలో పలువురు సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించారు.
నిమ్స్ పరికరాల కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుందని, పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో నిమ్స్ ఆస్పత్రి ఏర్పాటే చేయాలని కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్ కోరారు.

అవినీతికి తావులేదు
47కోట్లతో నిమ్స్‌ను ఆధునీకరించామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక నిమ్స్ ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున రోగులు రావడంతో బెడ్లు లభించడం లేదని వివరణ ఇచ్చారు.
1140 నుంచి 1500లకు బెడ్లను జరిగిందని తెలిపారు. గతంలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పుడు మాత్రం ఎలాంటి అవినీతికి తావులేదని తేల్చి చెప్పారు.
కాగా, మంత్రి హరీశ్ రావుకు సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను తప్సుపడుతూ సభా హక్కుల నోటీసులు ఇవ్వనున్నారు భట్టి విక్రమార్క. కాగా, రైతు రుణ మాఫీపై బిజెపి వాయిదా తీర్మానం ఇవ్వగా, హోంగార్డులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది.
రేవంత్, జనార్ధన్ రెడ్డి ప్రశ్నలు: హరీశ్ రావు సమాధానాలు
రేవంత్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి గోడౌన్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పారు. 1024కోట్లతో అన్ని మండలాల్లో గోడౌన్లను నిర్మించేందుకు ప్రణాళిక వేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. పాదర్శకంగా వ్యవహరించడం వల్ల రూ. 150కోట్ల ఆదాయం వచ్చింది.
నల్గొండ జిల్లాలో గోడౌన్ల ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యేలు కోరారని, అక్కడ కూడా నిర్మిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ అవసరమని చెప్పారు. వెంకట్ రెడ్డి, గుత్తా సుఖేందర్, జగదీశ్ రెడ్డి కోరినట్లు బత్తాయి మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. నకిరేకల్ లో నిమ్మకాయల మార్కెట్ కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఎస్టీ రైతుల కోసం దేవరకొండలో దొండకాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిల్లాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ విస్తరణపై వరంగల్‌లోని ఎన్‌ఐటీతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
పెన్షన్ల వివరాలు తెలపండి: అక్బరుద్దీన్, ఈటెల సమాధానం
పెండింగ్ లో ఉన్న పెన్షన్ల వివరాలను చెప్పాలని సంబంధిత మంత్రిని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. దీనికి సమాధానంగా ఈటెల మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అర్హులందరికీ పించన్లు అందిస్తున్నామని, మిగితా ఎవరైనా ఉంటే వారికి కూాడ అందిస్తామని తెలిపారు.
రెవెన్యూ లోటు ఉందా లేదా?: జానా, ఈటెల సమాధానం
రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉందో? లేదో చెప్పాలని సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈటెల.. ఉద్యోగుల డీఏ తప్ప గతం కంటే మరేం పెరగలదేని చెప్పారు. రెవెన్యూ లోటు పెద్దగా పెరగలేదని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం కూడా గతేడాది కంటే పెరిగిందని తెలిపారు. కాగా, 30వేల కోట్ల బడ్జెట్ లోటు వచ్చే అవకాశం ఉందని జానా రెడ్డి అన్నారు.
అక్బరుద్దీన్ వాకౌట్, జానా నిరసన
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయని, వీటితోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని అక్బరుద్దీన్ అన్నారు. మంత్రి జవాబు సరిగా లేదని, ఇందుకు నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని అక్బరుద్దీన్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జానారెడ్డి కూడా మంత్రి సమాధానం సరిగా లేదని సభలో నిరసన తెలిపారు.
పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మైనార్టీల కోసం దేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నది కూడా తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పేరుతో రూ.50వేలు ఇతర రాష్ట్రాలు ఇస్తున్నాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదని మండిపడ్డారు.
జయలలితకు సంతాపం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.












Click it and Unblock the Notifications