మోడీ కంటే రాహుల్‌ను తక్కువ చేశారు!
జార్ఖండ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ. తాజాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి క్లియరెన్స్ రాకపోవడంపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీపై విమర్శలు గుప్పించింది.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, రాహుల్ గాంధీకి ఇవ్వకపోవడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అసలు ఎన్నికల ప్రచారంలో లెవల్ ప్లే ఉండాలని, ఒకరి కంటే మరొకరిని తక్కువ లేదా ఎక్కువ చేసి చూడకూడదని చెప్పుకొచ్చింది. అందువల్ల ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలని కోరింది.

గాంధీని తక్కువ చేసే ప్రయత్నం జరిగిందని, అందుకే ఆయన జార్ఖండ్ ఎన్నికల ప్రచారం ఆలస్యం అయ్యిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాహుల్ గాంధీ అన్ని అనుమతులు పొందారని పేర్కొంది. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం, మహాగామా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రసంగించిన తరువాత రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1.15 గంటలకు ఇతర ప్రాంతాల ప్రచారానికి వెళ్లాల్సి ఉందని తెలిపింది.
కానీ, రాహుల్ గాంధీ హెలీకాప్టర్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. సమీపంలో ఇతర నాయకుల (ప్రధాని మోడీ) ప్రోటోకాల్ ఉన్న కారణంగా, నో-ఫ్లై జోన్ పరిమితి విధించారు. దీని వల్ల రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తే, అధికారంలో ఉన్న వాళ్లు ఈ ప్రోటోకాల్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది.
ప్రతిపక్ష నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకి ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో ఈసీ కలుగజేసుకుని లెవల్ ప్లే సరిగ్గా ఉండేలా చూడాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని మోడీ కంటే రాహుల్ గాంధీ ఏం తక్కవ? అని ప్రశ్నించారు.
ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి బయల్దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఆయన 2 గంటల తర్వాత మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ జార్ఖండ్‌లోని రెండు ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications