మీకే భోళాశంకరుడు: కవితకు రావుల కౌంటర్, దిగులు తెలంగాణ అయ్యిందని..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భోళా శంకరుడని, అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తుంటారని కెసిఆర్, తనయ నిజామాబాద్ ఎంపి కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ తన కుటుంబ సభ్యులకే భోళా శంకరుడు కానీ ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణలో బడ్జెట్ మిగులు ఉందని, కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత దిగులు తెలంగాణగా మారిందని ఆరోపించారు.
రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తున్నా ఇంతవరకు కేంద్రానికి నివేదికలు పంపేందుకు ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు. వరంగల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల సభలో 11ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న టిడిపిని కెసిఆర్ ఆడిపోసుకున్నారన్నారు. ఇక ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్‌ను కలుస్తామన్నారు.

కాగా, ఇటీవల ఎంపి కవిత మాట్లాడుతూ.. ‘మా నాన్న భోళాశంకరుడు. అడిగిన వారందరికీ వరాలు ఇస్తారు' అని అన్నారు. హన్మకొండలోని టిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. ఆంధ్రా ప్రభుత్వానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
16 నెలల్లో ఆంధ్రాకు రూ.8వేల కోట్లు అందించిన కేంద్రం తెలంగాణకు ఒక్కకోటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఏ రోజూ మాట్లాడలేదని.. కేంద్రమంత్రి దత్తాత్రేయ సైతం ఒక్క రూపాయి తీసుకురాలేకపోయారని విమర్శించారు. సిఎం కెసిఆర్‌కు కుడిభుజంగా ఉండటానికి కడియం శ్రీహరిచే రాజీనామా చేయించడంతో ఉప ఎన్నికలొచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications