చంద్రబాబుతో పంచాయితీ ఉండేదా?
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పదేళ్లపాటు ఏ గ్రామంలోనూ పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. అంతకుముందు ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే.. ఏనాడూ పాలమూరు గురించి పార్లమెంటులో ప్రస్తావించలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ జిల్లాకు న్యాయం జరగలేదన్నారు సీఎం రేవంత్. గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారని.. కానీ, జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. భీమ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసివుంటే ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదన్నారు రేవంత్. వైఎస్ఆర్, పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు. తన మీద పగతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారని గత కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజాపాలన సరిగాలేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారు. 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చకు వస్తే పాలనపై ముఖ్యమంత్రిగా తాను సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలోని 12 బీజేపీ పాలనపై చర్చిద్దామని అన్నారు. చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని అన్నారు.
Live: Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy Participates in The Public Meeting at Narayanpet https://t.co/iglbNijYO8
— Revanth Reddy (@revanth_anumula) February 21, 2025
పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ మండిపడ్డారు. మోసగాళ్ల మాటలు విని పరిశ్రమల కోసం భూసేకరణను అడ్డుకోవద్దన్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పుడే అభివృద్ధి చేసుకోవాలన్నారు. తాను ఈ ప్రాంతానికి చెందినవాడినని.. ఎవరికీ అన్యాయం జరగనివ్వనని అన్నారు. భూమి కోల్పోయిన వారికి ఎక్కువ పరిహారం ఇచ్చి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications