ఆ ఒక్క దిక్కూ పోయింది: రేవంత్ రెడ్డివి మాటలేనా?
కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయ పోరు మాటలకే పరిమితమైందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. నారా లోకేష్ కూడా ఎపికి వెళ్లిన క్రమంలో ఆయన చేసేదేమిటి....
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును గద్దె దింపడానికి నడుం బిగించిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదనే మాట వినిపిస్తోంది. కెసిఆర్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని ఆయన మాట్లాడుతున్నప్పటికీ పెద్దగా మద్దతు లభిస్తున్నట్లు లేదు.
ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడే ఆట మొదలైందంటూ ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు. ఆయన మాటలే తప్ప ఆట ఇప్పటికీ మొదలైనట్లు కనిపించడం లేదని అంటున్నారు. తెలంగాణ టిడిపికి మాత్రమే కాకుండా తనకు కూడా పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న నారా లోకేష్ కూడా తెలంగాణపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు.
ఇప్పుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రమే తెలంగాణ టిడిపి నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నట్లున్నారు. టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ నారా లోకేష్ గానీ తెలంగాణ నాయకులకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

నారా లోకేష్‌ను చూసుకుని రేవంత్ రెడ్డి....
తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేసినట్లు కనిపించారు. నారా లోకేష్ సాయంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నారు. గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో సత్తా చాటి తెరాసకు ఝలక్ ఇవ్వాలని భావించారు. దాంతో నారా లోకేష్‌తో పాటు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. కానీ, చివరకు మిగిలింది సున్నా మాత్రమే.

ప్రచార బరిలోకి చంద్రబాబునూ దించారు...
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార ఘట్టంలోకి చంద్రబాబును కూడా దించారు. నిజానికి, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. ఈ పరిధిలో అంతకు ముందు అత్యధిక శాసనసభా స్థానాలను కూడా గెలుచుకుంది. అయితే, టిడిపి ఎమ్మెల్యేలు కొంత మంది తెరాసలోకి జంప్ చేశారు. అయినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారనే నమ్మకంతో ప్రచారం సాగించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి చంద్రబాబు తెలంగాణ టిడిపిని పెద్దగా పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది.

టిడిపిలో మిగిలింది ఒక్కరా, ఇద్దరా....
తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నాయకులు కూడా పెద్దగా ఉన్నట్లు లేరు. జిల్లా స్థాయిల్లో చాలా వరకు బలహీనపడింది. జిల్లాల్లో బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి పర్యటనలు కూడా చేశారు. ఇప్పుడు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ రేవంత్ రెడ్డితో ఉంటున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ఉంటున్నారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది కాలం క్రితం తెరాసలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఆయన అలా వెళ్లలేదు. మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి కోసం వేచి చూస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే మాట వినిపిస్తోంది.

నారా లోకేష్ కూడా అప్పుడు....
తెలంగాణలో కెసిఆర్‌ను దెబ్బ కొట్టేందుకు నారా లోకేష్ కూడా అప్పట్లో తీవ్రంగానే ప్రయత్నించారు. కెసిఆర్‌పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణలో తిరిగి పార్టీకి గత వైభవం తేవాలని ప్రయత్నించారు. కానీ, చివరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రిగానే కాకుండా చంద్రబాబు వారసుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిని నిలబెట్టుకోవడానికే ఆయన కాలమంతా వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు.

కెసిఆర్ కుటుంబంపైనే రేవంత్ రెడ్డి దాడి....
కెసిఆర్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శల దాడి సాగిస్తున్నారు. ఆ నలుగురికే ఉద్యోగాలు దక్కాయంటూ విమర్శిస్తున్నారు. కెసిఆర్, కవిత, కెటిఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఆయన ఆ మాటలంటున్నారు. తాజాగా, కెటిఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలను పరిష్కరించడంలోనే కెసిఆర్ తలమునకలవుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ విమర్శలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తాయనేది చెప్పడం కష్టమే. ఆ నలుగురు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రకంగా వారు కెసిఆర్ ఆమోదం కన్నా ముఖ్యంగా ప్రజల ఆమోదం పొందారు. అందువల్ల ఆయన చేసే విమర్శల వాడి పనిచేయకపోవచ్చునని అంటున్నారు.

ఓటుకు నోటు కేసులో దొరక్కుండా ఉండి ఉంటే...
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడ్డారు. నిజానికి, రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో కొంత మేరకు ఓ జోష్ ఉంది. అయితే, ఓటుకు నోటు కేసులో పట్టుబడకపోయి ఉంటే ఆ మాటలకు విలువ ఉండేదనే మాట వినిపిస్తోంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పెద్ద యెత్తున జరిగిన కుట్రలో ఆయన భాగస్వామి అయ్యారనే ఆరోపణలున్నాయి. ఆ రకంగా ఆంధ్ర పాలకులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే అభిప్రాయం ఇప్పటికీ ప్రజల్లో బలంగా ఉంది. అందువల్ల ఆయన ప్రయత్నాలు ఎన్ని చేసినా మిగిలేది ఏమీ ఉండదనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications