పుష్కర స్నానం: కెసిఆర్ ముందు ప్రత్యక్షమైన పాము
కరీంనగర్: జిల్లాలోని ధర్మపురిలో మంగళవారం గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తున్న సమయంలో ఆయన సమీపంలో ఓ పాము ప్రత్యక్షమైంది. మంగళవారం ఉదయం 6:21 గంటలకు ఏడుగురు పీఠాధిపతులతో కలిసి గోదావరిలో సతీసమేతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుష్కర స్నానం చేశారు.
అనంతరం గోదావరికి హారతి ఇస్తుండగా ఆయన ముందు ఓ పాము ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన జాలర్లు ఆ పామును బెలూన్ ట్యూబ్‌తో బంధించి అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

పుష్కరఘాట్ల వద్ద కిక్కిరిసిన భక్తులు
గోదావరి పుష్కరాలు వైభవంగా కొనసాగుతోన్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ సంతరించుకుంది. భక్తులు పుణ్యస్నానం ఆచరించడానికి పుష్కరఘాట్ల వద్ద బారులు తీరారు. భక్తులతో పుష్కరఘాట్లు కిక్కిరిసిపోయాయి.
భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులతో పుష్కరఘాట్లు, ఆలయాలు కళకళలాడుతున్నాయి. పుష్కరఘాట్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కరఘాట్ల నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి.
జయశంకర్‌కు పిండప్రదానం
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్‌కు, అమరవీరులకు మంచిర్యాల మండలం ముల్కల్ల వద్ద పిండప్రదానం చేశారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వేద పండితుల ఆధ్వర్యంలో పిండ ప్రదానం నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రమౌళ్వీర్యస్వామి జయశంకర్‌సార్‌కు పిండ ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications