స్పీకర్‌పై అవిశ్వాసానికి టిడిపి: జానారెడ్డి తిరకాసు
హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే యోచనలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై అవిశ్వాసం పెట్టే విషయంలో మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ నేత జానారెడ్డిని టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి కలిసి కోరారు.

అయితే జానారెడ్డి తిరకాసు పెట్టారు. ఓటింగ్ విషయంలో మద్దతివ్వబోమనే విషయాన్ని ఆయన చెప్పకుండానే చెప్పేశారు. స్పీకర్‌పై టిడిపి ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జానారెడ్డి వారికి తెలిపారు. ఓటింగ్ విషయంలో కాకుండా చర్చలో మద్దతిస్తామని ఆయన చెప్పారు.
పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోవడం, అసెంబ్లీలో సీట్ల కేటాయింపులో అన్యాయం జరగడంతోపాటు బీఏసీలో సైతం తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిసిన తర్వాతే అవిశ్వాసంపై తుది నిర్ణయం తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications