తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా బీఆర్ఎస్ వ్యూహం!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చివరివి కావడంతో ఈ సమావేశాలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు మాటల దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వరద పరిస్థితులను, ప్రజలకు పూర్తిగా సహకారం అందించలేకపోయిన ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బిజెపి భావిస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇటు వర్షాలు, వరదల పరిస్థితిని, మరోవైపు వరదలతో పంట నష్టపోయిన రైతులు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తోంది.

అయితే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని తెలుస్తుంది.
గవర్నర్ తమిళి సై తిప్పి పంపిన బిల్లులలో యూనివర్సిటీలలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు కూడా ఉంది. మళ్లీ ఈ బిల్లును తెలంగాణా అసెంబ్లీలో పెట్టనున్నారు. మరోవైపు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తుపై టిపిసిసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి సభలో చర్చకు లేవదీసి, కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎదురుదాడి చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది.
ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేయాలని అన్ని పార్టీలు భావిస్తుంటే ఈ శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ రెండవ వారం లేదా మూడో వారంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఆగస్టు 18 తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక ఎన్నికలు దగ్గరలో ఉన్న సమయంలో శాసనసభ సమావేశాలు ఇవే చివరివి కావడంతో ఈ శాసనసభ సమావేశాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేస్తుంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది వంటి అనేక విషయాలను ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చెప్పే అవకాశం ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అవుతుంది.












Click it and Unblock the Notifications