రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్, కాంగ్రెస్ ఎంపీల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, చాలమ కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారు. తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూముల అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు.

ప్యారడైజ్ నుంచి బోయినపల్లి, సుచిత్ర రహదారిలో రోడ్డు చిన్నగా ఉండి, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ కలవనున్నారు.
రైతులకు రూ.2 లక్షల వరకూ పంటరుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.31 వేల కోట్లను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. సోమ, మంగళవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు విషయాల్లో హైకమాండ్‌తోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. కొందరు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీలో పార్టీ నేతల ద్వారా పైరవీలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవులు ఎవరెవరికి కేటాయించాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.
ముఖ్యమంత్రి పదవితోపాటు పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పదవీకాలం మూడేళ్లు. ఇది జూన్ 27వ తేదీతో పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ అంశంపైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీలతో ఆయన చర్చించనున్నారని సమాచారం. ఇప్పటికే పీసీసీ పదవి రేసులోనూ పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ విషయంపైనా ఢిల్లీలో లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలంతా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications