కాంగ్రెస్‌కు బిగ్‌షాక్: కోమటిరెడ్డి గుడ్‌బై? బీజేపీలో చేరికకురెడీ?: బండి సంజయ్‌తో టచ్
హైదరాబాద్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఫిరాయింపుల విషయంలో భారతీయ జనతా పార్టీ లబ్ది పొందుతోన్నట్టే కనిపిస్తోంది. ఇదివరకు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. బీజేపీ శాసనసభ్యుడిగా సభలో అడుగు పెట్టారు.

కోమటిరెడ్డి రెడీ..
ఇప్పుడిక కాంగ్రెస్ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చినట్టే. కాషాయ కండువా కప్పుకోవడానికి ఆయన సిద్ధపడ్డారనే ప్రచారం ఊపందుకుంది. వచ్చేవారం ఆయన ఢిల్లీకి వెళ్లబోతోన్నారని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అటు బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు.

2009లో ఎంపీగా..
టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పని చేస్తూ వస్తోన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, లక్షా 40 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా..
అప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటోన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉంటోన్నారని, పార్టీ ఫిరాయించే అవకాశాలు లేకపోలేదంటూ వార్తలొచ్చాయి. ప్రత్యేకించి- ఇటీవలే ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం ప్రచారం మరింత ఊపందుకుంది. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకునే వచ్చారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తొలుత తోసిపుచ్చినా..
దీన్ని ఆయన తోసిపుచ్చారు. ఆదివారమే ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పార్టీ ఫిరాయింపు వార్తలపై స్పందించారు. తాను పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు. అధికార టీఆర్ఎస్ నాయకులు లేనిపోని అపోహలను సృష్టిస్తోన్నారంటూ మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోగొట్టుకున్న పరువును తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మునుగోడుతో నిలుపుకోవాలనుకునే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.

మునుగోడు ప్రజల కోరిక మేరకే..
తాను పార్టీ మారాల్సి వస్తే.. అది తన అనుచరులు, మునుగోడు నియోజకవర్గ ప్రజల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందనీ స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ తాజాగా ఆయన పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మూడు రోజుల పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు, అనుచరులతో సంప్రదింపులు జరిపారని, పార్టీ ఫిరాయించడమే మేలని, ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరాలనేనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని తెలుస్తోంది.

నాలుగైదు రోజుల్లో..
వారి అభిప్రాయాలు, సూచనల మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అదే సమయంలో బండి సంజయ్ కూడా లీకులు ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ నాయకులు తనతో టచ్‌లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. మరో నాలుగైదు రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్తారని, జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

అదొక్కటే కండిషన్..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నాయకులు ఓ కండిషన్ పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరడానికి ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. రాజీనామా చేస్తే- మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమౌతుంది. అదే జరిగితే- ఉప ఎన్నికలో గెలిచి తన సత్తాను మరోసారి నిరూపించుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications