తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెద్ద మనసు: ఏకంగా 100 కోట్లు విరాళం
Telangana rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దంచికొట్టిన అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సహా నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.

భారీగా ఆస్తినష్టం సంభవించింది. లక్షల హెక్టార్లల్లో పంట నష్టం సంభవించింది. చేతికి అందిన పంట నీటి పాలయింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రత్యేకించి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు విలయతాండవం చేశాయి. మున్నేరు వాగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
భారీ వర్షాలు, వరదల వల్ల 5,438 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారాయన.
రాష్ట్రంలో సంభవించిన ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వేతనాన్ని పొందే ప్రతి ఉద్యోగి కూడా తమవంతు సహాయంగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నారు. దీని విలువ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు.
ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వీ లచ్చిరెడ్డి వెల్లడించారు. వరదల వల్ల అనేక జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితుల్లో తమవంతుగా ప్రభుత్వానికి సహాయం చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఉద్యోగుల తరపున ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications