తెలంగాణలో పదో తరగతి విద్యార్థులంతా పాస్... జీవో విడుదల చేసిన ప్రభుత్వం...
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ,ప్రైవేట్,ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం మే 17వ తేదీ నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ మేరకే తాజా ఫలితాలు వెల్లడించింది. బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. పరిస్థితులు చక్కబడిన తర్వాత వ్యక్తిగతంగా పరీక్షలు రాయవచ్చని గతంలో విద్యాశాఖ వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షలు కూడా నిర్వహించడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే పదో తరగతి ఫలితాల తరహాలోనే అసెస్మెంట్ విధానంలో 12వ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో గత ఏడాది కాలంగా విద్యా సంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ తర్వాత కొన్ని నెలల పాటు విద్యా సంస్థలు తెరుచుకున్నప్పటికీ రెండో వేవ్ విజృంభించడంతో మళ్లీ మూతపడక తప్పలేదు.
ఇక కరోనా విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం తాజాగా తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కేబినెట్ భేటీ అయి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications