ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖదీర్ ఖాన్(37) మృతి కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. మంగళవారం విచారణ చేపట్టింది. ఖాదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖదీర్ ఖాన్(37) మృతి కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. మంగళవారం విచారణ చేపట్టింది. ఖాదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ శాంతికుమారి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, మెదక్ డీఎస్పీ, ఎస్ హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.
పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకే ఖాదీర్ ఖాన్ మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కేసును సుమోటోగా తీసుకుంది హైకోర్టు. నేడు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కోర్టులో హాజరుపర్చిన 14 రోజులకు ఖదీర్ ఖాన్ మరణించారని అదనపు ఏజీ వాదనలు వినిపించగా.. ఖదీర్ మృతికి కారణాలపై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్ఫష్టం చేసింది.
కాగా, మెదక్‌లో జనవరి 27న జరిగిన ఓ గొలుసు దొంగతనం కేసులో ఖదీర్ ఖాన్ ను అనుమానితుడిగా భావించిన పోలీసులు.. జనవరి 29న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని మెదక్‌కు తరలించారు. ఐదు రోజులపాటు కస్టడీలో ఉంచుకున్న అనంతరం భార్యను పిలిపించి ఖదీర్ ను అప్పగించారు. అతడు ఆస్పత్రికి వెళితే తమ బండారం బయటపడుతుందని భావించి.. ఖదీర్ ను ఇంట్లోనే ఉంచి మాత్రలు వేయాలని సూచించడం చర్చనీయాశంగా మారింది.

ఖదీర్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు మొదటగా మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ్నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న ఖదీర్ మృతి చెందాడు.
మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, తీవ్రంగా కొట్టడం వల్లే ఖదీర్ మృతి చెందాడని అతడి భార్య ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులను సస్పెండ్ చేశారు. తాజాగా, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications