తెలంగాణ ఏజీపై హైకోర్టు తీవ్ర స్పందన, కీలక వ్యాఖ్యలు: ఏపీ రైతుల పిటిషన్ విచారణ
హైదరాబాద్: తెలంగాణ అటార్నీ జనరల్(ఏజీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం కృష్ణా బేసిన్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ఇచ్చిన జీవో 34పై వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారించింది.
తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి ఇంధనశాఖ పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని కృష్ణా జిల్లా రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడొద్దని అభ్యంతరం తెలిపారు.

కాగా, పిటిషన్‌ను సీజే ధర్మాసనం ముందుంచాలని తెలంగాణ ఏజీ ప్రసాదర్ కోరారు. అయితే, విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏజీ స్థాయి అధికారి నుంచి అసమంజస అభ్యర్థన సరికాదని వ్యాఖ్యానించింది. సీజే ధర్మాసనం ఎదుట విచారించాలనడం తమ ధర్మాసనంపై దాడేనని హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించింది. రాజోలిబండ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయాలని సూచించింది. దీనిపై మంగళవారం వాదనలు వినిపించాలని పిటిషనర్, కేంద్రం, తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది.
ఏపీ, తెలంగాణల మధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని తెలంగాణ మంత్రులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మీ ప్రాజెక్టులు అక్రమమంటే.. మీ ప్రాజెక్టులు అక్రమమంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామని ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications