మంత్రి కోమటిరెడ్డితో దిల్ రాజు, రాఘవేంద్రరావు: వరాలు
Dil Raju: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై వరాలు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి కొన్ని రాయితీలను ప్రకటించడానికి కసరత్తు మొదలు పెట్టింది. దీనికి అవసరమైన ప్రతిపాదనలను తెప్పించుకంటోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో సెటిల్ అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నానక్‌రామ్ గూడ.. వంటి ప్రదేశాల్లో సినీ పెద్దలు నివసిస్తోన్నారు. స్టూడియోలన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత టాలీవుడ్‌ను విశాఖపట్నానికి తరలించే ప్రయత్నాలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.

దీనికోసం భారీగా రాయితీలను ప్రకటించింది. ఏపీలో షూటింగ్ చేసే సినీ నిర్మాణ సంస్థలపై వరాల జల్లును కురిపించింది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ఎటూ వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం సైతం కసరత్తు చేపట్టింది. తెలంగాణలో సినిమా షూటింగులను జరిపే నిర్మాతలకు రాయితీలను ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కొద్దిసేపటి కిందటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. 15 మందితో కూడిన టాలీవుడ్ టీమ్ మంత్రిని కలిసింది. కొన్ని ప్రతిపాదనలను అందజేసింది. మంత్రిని కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు ఉన్నారు. పలు రాయితీలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మర్యాదపూరకంగా మంత్రిని కలిశామని సినీ పెద్దలు చెప్పారు. సినిమా రంగ పురోభివృద్ధి వీలైనంత సహాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణలోని ఇతర నగరాల్లో కూడా విస్తరించాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. దీనికి సహకరిస్తామని మంత్రి చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications