జనసేనలోకి కీలక నేతలు: పవన్ గ్రీన్ సిగ్నల్,చర్చలు
Recommended Video

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై జనసేన ప్లాన్ చేస్తోంది.ఇతర పార్టీల నుండి కొందరు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలతో జనసేన టీమ్ ఇప్పటికే చర్చించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ దిశగానే తాను రాజకీయాలను చేయనున్నట్టు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేయలేదు.
2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బిజెపి,టిడిపి కూటమికి మద్దతును ప్రకటించారు. కానీ, 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

జనసేనలో చేరేందుకు నేతల ఆసక్తి
2019 ఎన్నికలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిద పార్టీల నుండి జనసేనలో పలువురు చేరే అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో పలువురు నేతలతో జనసేనకు చెందిన ముఖ్యులు ప్రాధమికంగా చర్చలు జరిపారని సమాచారం. అయితే త్వరలోనే వీరంతా జనసేనలో చేరే అవకాశాలున్నాయని జనసేన పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

రిటైర్డ్ అధికారులు,జర్నలిస్టులు జనసేనలో చేరే అవకాశం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు రిటైర్డ్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు జనసేనలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు ఆయా వర్గాలు ఇప్పటికే జనసేనతో సంప్రదింపులు జరిపేందుకు సానుకూలంగా స్పందించాయని సమాచారం. వారితో కూడ త్వరలోనే జనసేన వర్గాలు చర్చించే అవకాశాలున్నాయి.

పిఆర్‌పి తరపున పోటీ చేసిన నేతల ఆసక్తి
2009 ఎన్నికల సమయంలో పిఆర్‌పి టిక్కెట్టుపై పోటీ చేసిన కొందరు నేతలు జనసేనలో చేరేందుకు కొంత ఆసక్తిని చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే పిఆర్‌పిలో ఆనాడు పోటీ చేసిన నాయకుల్లో కొందరు టిడిపి, మరికొందరు కాంగ్రెస్ , వైసీపీల్లో చేరారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నందున భావిస్తున్న నేతలు జనసేన వైపు చూస్తున్నారని సమాచారం. గతంలో పిఆర్‌పి తరపున పోటీ చేసిన నేతలు ఈ మేరకు మరోసారి జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఎవరెవరు ఆ జాబితాలో ఉన్నారనే విషయాన్ని మాత్రం జనసేన వర్గాలు ఇప్పుడే వెల్లడించడం లేదు.

పార్టీ నిర్మాణంపై దృష్టి
క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన ప్లాన్ చేస్తోంది. పార్టీ నిర్మాణాన్ని కింది స్థాయి నుండి చేపట్టాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నిర్మాణం బలంగా లేకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని జనసేన చీఫ్ భావిస్తున్నాడు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై కేంద్రీకరించారు. సంస్థాగతంగా పార్టిని బలోపేతం చేసుకొంటూనే ఇతర పార్టీల నుండి వచ్చే నేతలతో సంప్రదింపులు జరపాలని జనసేన పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications