గందరగోళం, సభ వాయిదా: రోడ్లు ఊడ్చిన బిజెపి సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తీవ్ర గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా పడింది. గురువారం శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు తమ తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు.
అయితే, ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యనే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యురాలు కొండా సురేఖ అంగన్‌వాడీ సమస్యలపై ప్రశ్నలు వేశారు. ఆమె వేసిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమాధానం ఇచ్చారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

ఈ స్థితిలో స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారం పది గంటలకు వాయిదా వేశారు. రుణమాఫీ గురించి తాము ప్రస్తావిస్తే సభ నుంచి ప్రభుత్వం పారిపోయిందని బిజెపి సభ్యుడు ప్రభాకర్ అన్నారు.
ఇదిలావుంటే, జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. జీతాలు పెంచాలని అడిగిన కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేయడం ఎంత వరకు న్యాయమని బీజేపీ నేతలు ప్రశ్నించారు. తొలగించిన జీహెచ్ఎంసీ కార్మికులను వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications