బిగ్ ట్విస్ట్, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - ఛాన్స్ దక్కేదెవరికి..!!
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే విడతలో మొత్తం 119 మంది అభ్యర్దులకు గాను 115 మందిని ప్రకటించారు. ఏడుగురు సిట్టింగ్ లకు ఛాన్స్ ఇవ్వలేదు. నాలుగు స్థానాలు ప్రకటించాల్సి ఉంది. అభ్యర్దుల ప్రకటన ద్వారా ఎన్నికల కదన రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరో కీలక నిర్ణయం : ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో మూడు నెలల కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే 115 మంది అభ్యర్దులను కేసీఆర్ ప్రకటించారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను సీట్లు ఖరారు చేసారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తిరిగి సీటు కేటాయించారు. ఈ సీటు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి కీలక హామీ దక్కింది. దీంతో, ఆయన రోహిత్ రెడ్డికి సీటు ప్రకటన..సహకారం అందించేందుకు అంగీకరించారు.
మహేందర్ రెడ్డికి ఛాన్స్ : పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్, తాండూరు పరిధిలో ప్రభావితం చేయగలిగిన వర్గం ఉంది. బీఆర్ఎస్ లో సీటు రాకపోతే కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డి, అనుచర వర్గానికి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస సిద్దమైంది.
ఆ సమయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పట్నంతో చర్చలు చేసారు. ఆయనకు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగించేలా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఒప్పందం మేరకు ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం దక్కనుంది.

ఈటల స్థానంలో భర్తీ : ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు మధ్నాహ్నం పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. మంత్రిగా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డితో ఆ స్థానం భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మూడు నెలలు పట్నం మహీందర్ రెడ్డి మంత్రిగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగకుండా.. జిల్లాలో పట్నం, పైలెట్ రోహిత్ రెడ్డి కలసికట్టుగా పని చేసి అభ్యర్దులను గెలిపించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.












Click it and Unblock the Notifications