2 నిమిషాలు మాట్లాడుతామంటే, అందుకే మహేష్ కత్తిపై గుడ్లు విసిరాం: స్టూడియోకు యువకులు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తన ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తిపై గురువారం హైదరాబాదులో కొందరు గుడ్లతో దాడి చేశారు. ఈ దాడి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దాడికి తామే పాల్పడ్డామంటూ ఇద్దరు వ్యక్తులు ఓ టీవీ ఛానల్ ఎదుటకు వచ్చారు.
మహేష్ కత్తిపై గుడ్లతో దాడి చేయడానికి గల కారణాలను వారు తెలిపారు. పవన్ పైన మహేష్ కత్తి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలతో తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామని వారు చెప్పారు. కొన్ని రోజులుగా మహేష్ కత్తిని కలిసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నా, ఫలితం లేకుండా పోయిందన్నారు.

మహేష్ కత్తిని కలిసే ప్రయత్నం
ఇటీవల సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా మహేశ్ కత్తిని కలిసేందుకు ప్రయత్నించామని, పోలీసులు అనుమతించలేదన్నారు. ఆ రోజు ఆయన కారు బయటకు వచ్చిన తర్వాత కత్తి మహేశ్ కారు వెనుక ఫాలో అయ్యామని, తాజ్ కృష్ణ హోటల్ సిగ్నల్ వద్ద ఆయన కారు ఆపామని చెప్పారు.

రెండు నిమిషాలు మాట్లాడుతామని
రెండు నిమిషాలు మాట్లాడతాం సార్ అంటూ కత్తి మహేష్‌తో చెప్పామని, దానికి ఆయన కుదరదని తల ఊపారని వారు చెప్పారు. మా తప్పేమన్న ఉంటే క్షమాపణ చెబుతామని, ఆయన తప్పేమన్న ఉంటే కత్తి మహేశ్ క్షమాపణలు చెప్పాలని అడుగుదామని అనుకున్నామని తెలిపారు.

కోడిగుడ్ల దాడి మేమే చేశాం
పవన్ కళ్యాణ్ తనకు క్షమాపణలు చెప్పాలని కత్తి మహేశ్ డిమాండ్ చేయడం అసంబద్ధమని వారు అన్నారు. గురువారం రాత్రి కత్తి మహేశ్ పై కోడిగుడ్లతో దాడి చేసింది తామేనని, కేవలం, తమ నిరసన తెలిపేందుకే ఈ విధంగా చేశామని చెప్పారు.

అనుమానాలు రెట్టింపు
కాగా, మహేష్ కత్తిపై కోడి గుడ్ల దాడి వెనుక కుట్ర దాగి ఉందని పవన్ అభిమానులు మొదటి నుంచి భావిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మహేష్ కత్తికి ఏ టీవీ ఛానల్ అయితే ఫేవర్‌గా ఉంటుందో అదే ఛానల్ ఎదుటకు వారు వచ్చారు. దీంతో అనుమానాలు రెట్టింపవుతున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications