జంపింగ్స్: దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లకు నిన్న బండి సంజయ్, నేడు హరీశ్ రావు కండువా వేశారు!
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగులు చేస్తున్నారు. తాజాగా, దుబ్బాకలో ఇదే జరిగింది.
దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, కాషాయ తీర్థం పుచ్చుకుని 24 గంటలు కూడా గడువక ముందే మళ్లీ గులాబీ గూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తిరిగి గులాబీ పార్టీలో చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణకు మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. తాము టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని కౌన్సిలర్లు ప్రకటించారు.

Recommended Video
కాగా, దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్‌లు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
అయితే, బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే తిరిగి టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడం చర్చనీయాంశంగా మారింది. మరో కౌన్సిలర్ మల్లారెడ్డి మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల దుబ్బాకకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ నేత రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాకలో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications