తెలంగాణకు తీరని అన్యాయం: ఎంపి వీహెచ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మంచి రోజులు వస్తాయని ఎదురుచూసిన తెలంగాణకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో హనుమంతరావు పాల్గొని మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.
తెలంగాణకు కనీసం ఒక్క కొత్త రైలు ఇవ్వలేదని, చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించలేదని, రైల్వే జోన్ ఇవ్వలేదని హనుమంతరావు విమర్శించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్-కరీంనగర్-మెదక్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదని ఆయన చెప్పారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్‌ల నిర్మాణానికి సంవత్సరాలు పడుతోందని, ఈ దురవస్థ ఏంటని ప్రశ్నించారు.

దక్షిణ మధ్య రైల్వేకు మంచి ఆదాయం ఉన్నా ప్రాజెక్టులు కేటాయించటం లేదని, శబరిమల, షిర్డీ సాయిబాబా దేవాలయాలకు వెళ్లేందుకు రైలు సౌకర్యం లేదని ఎంపి వీహెచ్ చెప్పారు. ఈ ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు విజప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, హైదరాబాద్‌లోని కాచిగుడా, నాంపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకీకరించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎంటిసి విస్తరణను ఎందుకు చేపట్టటం లేదని ప్రశ్నిస్తూ, షాద్‌నగర్, యాదగిరి గుట్ట వరకు ఎంఎంటిఎస్‌ను పొడిగించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
వరంగల్‌లో రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని దీర్ఘ కాలం నుంచి కోరుతున్నా పట్టించుకోవటం లేదని, సికింద్రాబాద్‌లో రైల్వే మెడికల్ కాలేజీ ఏర్పాటు ఏమైందని ఆయన ప్రశ్నించారు. నడికుడి-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైనుగా ఎందుకు మార్చటం లేదని నిలదీశారు. బెంగళూరుకు డబుల్ లైను ఏర్పాటు చేయాలని, ఏపి ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేయాలని వీహెచ్ సూచించారు.
షాద్‌నగర్, యాదగిరిగుట్ట, వికారాబాద్‌లకు ఎంఎంటిసి రైలు ఏర్పాటు చేయాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, రైల్వేలకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.












Click it and Unblock the Notifications