మాణిక్ రావు ఠాక్రేకు మతిభ్రమించింది: ప్యాకేజీ పార్టీ అంటూ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. ' తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుంది. క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత' అని ఘాటుగా స్పందించారు విజయశాంతి.
కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పైనా విజయశాంతి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సీట్లు తగ్గుతాయన్న సంకేతాలతో కేసీఆర్ కాంగ్రెస్‌ను లేపే పనిలో ఉన్నారన్నారు. మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్‌లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయశాంతి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలను బీఆర్ఎస్‌లో విలీనం చేసుకునే దిశగా కేసీఆర్ వ్యూహాలు రచన చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్యాకేజీ పార్టీ అని.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా అమ్ముకుందో ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు చెప్పుకోవాల్సిందిపోయి.. ఆవిర్భావ వేడుకల పేరుతో ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్లు పలు మీడియాలు కూడా ప్రసారం చేశాయని.. అది సరికాదన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని సూచించారు.
కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి తదితరులతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని నేతలు ఖండించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని, బీజేపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ బీజేపీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications