కాంగ్రెస్ సర్కారును పడగొట్టం, కానీ! పోలీసులూ డైరీలో రాస్కోండి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతామంటోందని.. అమ్మితే విచక్షణ ఉండాలి కదా అని ప్రశ్నించారు.
ఉపయోగంలో లేని భూములను అమ్మాలి కానీ.. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్ముతారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పేదల కోసం తాము కేసీఆర్ కిట్ పథకం అమలు చేశామన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ. 12 వేలు ఇచ్చామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని నిలిపివేసిందని కేసీఆర్ మండిపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం తమ ప్రభుత్వం నిలిపివేయలేదని.. ప్రజలకు ఉపయోగపడే పథకమని తాము కూడా అమలు చేశామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకమైనా తాము అమలు చేశామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారని.. అది సాధ్యమేనా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్స సభను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని కేసీఆర్ ఆరోపించారు. అనేక అడ్డంకులు సృష్టించినా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారన్నారు. మరో లక్షన్నర మంది వరకు రాకుండా ఆగిపోయారని తెలిపారు. ఈ ప్రభంజనాన్ని ఎవరు ఆపుతారని అన్నారు.
డైరీలో రాస్కోండి.. పోలీసులకు కేసీఆర్
పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా.. ప్రజలకు అడిగే హక్కుంటది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రజలకోసం ప్రశ్నిస్తుంటే.. కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎందుకు ఉరుకులాడుతున్నారు. రాత్రి పోయి మీ డైరీలో రాస్కోండి. వందకు వందశాతం మళ్లీ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంటే. అడ్డుకోవడం ఎవరితరం కాదు. పోలీసులు చదువుకోలేదా? కాంగ్రెస్ ప్రజలను మోసం చేయలేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు. మేం చట్టాలను ఉల్లంఘించమని కేసీఆర్ అన్నారు.
అన్యాయంగా కేసులు పెట్టినా లీగల్ సెల్ ఉంది.. న్యాయస్థానాలున్నాయి. కేసీఆర్, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు భయపడాల్సిన పనిలేదు. నేను కూడా ఊరుకోను అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో, మంచినీళ్లు ఇవ్వడంలో, కరెంటు సరఫరా చేయడంలో, పంటలకు నీళ్లు ఇవ్వడంలో, విత్తనాలు, ఎరువుల సరఫరాలో, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయ్యిందని కేసీఆర్ విమర్శించారు.
కగార్ ఆపరేషన్ ఆపాలంటూ కేంద్రానికి కేసీఆర్
కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోడీ చాలా సార్లు అవమానించారన్నారు.
మావోయిస్టుల కోసం చేపట్టిన కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ పేరుతో గిరిజన యువకులను చంపుతున్నారని ఆరోపించారు. కగార్ ఆపరేషన్ ఆపి.. నక్సలైట్లతో చర్చలు జరపాలన్నారు. దీనిపై కేంద్రానికి తీర్మానం పంపిద్దామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టం
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎందులో పాసయిందని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల పని.. అబద్ధపు వాగ్ధానాలు, కమీషన్లు, సంచులు నింపుడు మోసుడు.. అని కేసీఆర్ ఆరోపించారు. 20 నుంచి 30 శాతం కమీషన్లు అడుగుతున్నారని కాంట్రాక్టర్లే సచివాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. దీనిపై కేటీఆర్ అసెంబ్లీలో అడిగితే ఆర్థిక మంత్రి భుజాలు తడుముకున్నారని అన్నారు. ఇక, తాను అసెంబ్లీకి వచ్చి కాయకూరల ముచ్చట్లు వినాలా అని ప్రశ్నించారు.
ఇళ్లు కూడలగొడితే ఓ తమ్ముడు కేసీఆర్ రావాలని అంటున్నాడు. కత్తి వాని చేతికి ఇచ్చి.. యుద్ధం కేసీఆర్ ను చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ రజతోత్స శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామన్నారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిన్నరకే ఇంత మంది జనం వచ్చారంటే.. ఓట్లు ఎప్పుడొస్తాయని చూస్తున్నట్లు అర్థమైందన్నారు. ఈ ప్రభుత్వాన్ని మరో మూడున్నరేళ్లు భరించాలా? అని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో ఒకరు అన్నారని కేసీఆర్ చెప్పారు.
తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతాం? మా కాళ్లకు, చేతులకు గులగుల ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుంట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే వీపు సాఫ్ చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. సభ నిర్వాహకులు, సభ కోసం భూములు ఇచ్చి సహకరించిన రైతులు, ప్రజలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications