తెలంగాణలో 4 రోజులు జోరు వానలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో గత ఒకటి రెండు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవడంతో ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి కొస్త ఉపశమనం పొందారు. తాజాగా, వాతావరణ శాఖ ప్రజలకు మంచి వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక, సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగ్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
మరోవైపు, గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications