సర్వదర్శనం భక్తులకు ఉచితంగా చిన్న లడ్డు
శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన ప్రదేశం తిరుమల అని, ఇక్కడ సేవలందించడం ఉద్యోగులు చేసుకున్న జన్మజన్మల పుణ్యఫలమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ పరిపాలనా భవనంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. హిందూ ధర్మం పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్ద దిక్కుగా నిలిచిందన్నారు.
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని, ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు, అధికారులు భక్తుల సేవలో తరించాలని భూమన సూచించారు. సర్వదర్శనంద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డూ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. మాత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దళితవాడలకు తీసుకువెళ్లి అక్కడే కల్యాణం నిర్వహించడంతోపాటు స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

దివంగత వైఎస్ సహకారంతో వేదపరిరక్షణకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేయబోతున్నట్లు చెప్పారు.శ్రీ వెంకటేశ్వర భక్తిఛానల్ కు ప్రస్తుతం 8 కోట్లమంది వీక్షకులున్నారు. కల్యాణమస్తు కార్యక్రమం ఉద్దేశాన్ని భూమన వివరించారు. పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనిచ్చేందుకే కల్యాణమస్తును తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 32వేల జంటకు పైగా స్వామివారి సమక్షంలో వివాహాలు చేసి ఆయన ఆశీస్సులు అందజేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications