వీఐపీ ఒత్తిడి భరించలేకున్నా: దర్శనం, వసతిపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో వేసవి సెలవుల్లో భారీగా భక్త జనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొండ పైన రద్దీ బాగా పెరిగింది. ఏప్రిల్ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/ దర్శన టికెట్లను టిటిడి బోర్డు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
అభిషేకం టికెట్లకు ఒత్తిడి భరించలేకున్నా: తిరుమలోల శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం వీఐపీల నుంచి వస్తున్న ఒత్తిడిని భరించలేకున్నానని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారి శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం దాదాపు 250 మంది వీఐపీలు జేఈవో కార్యాలయానికి దరఖాస్తు చేసారు. టికెట్లు 160 ఉండగా, అందులో 130 ముందుగానే బుక్ అవుతాయి.

మిగిలిన 30 టికెట్ల కోసం వీఐపీలు ఒత్తిడి చేసారని చెప్పారు. అభిషేకం టికెట్లు ఎక్కువ ఇచ్చినా లోపల వారికి కూర్చునే పరిస్థితి ఉండదన్నారు. దీంతో విధులు నిర్వహించటం కష్టంగా మారిందని వివరించారు.భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచడానికి గతంలో లాగే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
సామాన్య భక్తులకే వసతి: తిరుమలలో దాదాపు 7400 గదులు, 4 పిఏసిలు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని ఈవో వెల్లడించారు. తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్ వచ్చిన తర్వాత సంబంధిత సబ్ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలి.
ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరని చెప్పుకొచ్చారు. నిర్ణీత సమయం(రెండు గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుంది. గదికి చెల్లించిన అద్దె తిరిగి ఇవ్వబడదు. కాషన్ డిపాజిట్ మాత్రమే తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గదులు త్వరగా ఖాళీ అవడమే గాక, భక్తులకు గతంలో కంటే మరిన్ని ఎక్కువ గదులు కేటాయించే అవకాశం కలుగుతోంది.
విశాఖ ఆలయంలో ఆర్జిత సేవలు: విశాఖలోని శ్రీవారి ఆలయంలో త్వరలో ఆర్జిత సేవలు ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. కొండ పైన పెరుగుతున్న రద్దీతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వివరించారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పా హారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నామన్నారు.
ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేసినట్లు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశామని వివరించారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ చేసేందుకు చర్యలు తీకున్నామని ఈవో వివరించారు.












Click it and Unblock the Notifications