సీఎం జగన్ 5 రూపాయాలు కూడా ఆదా చేయలేరు : చంద్రబాబు కు ఆ స్థాయి లేదు..సుజనా చౌదరి ఫైర్..!!
టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ సర్కార్‌కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టద్దని..అలా చేస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. రాజధాని..పోలవరం మీద గందరగోళం నెలకొందన్నారు. రాజధాని పైన బొత్సా వ్యాఖ్యలు చేసి నెల రోజులు అవుతున్నా..ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. పోలవరం టెండర్లు మార్చటం వలన 5 రూపాయలు కూడా ఆదా చేయలేరని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు మాజీ సీఎం చంద్రబాబు స్థాయిలో లేవన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
పాలనపై వైసీపీ దృష్టి పెట్టాలి...
మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజధాని ప్రాంత రైతులతో గవర్నర్ విశ్వభూషన్ హరించందన్‌ను కలిసారు. రాజధాని అంశంపై ఫిర్యాదు చేశారు. మాట్లాడవారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు. పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం, అమరావతిపై గందరగోళం నెలకొందన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
రాజధాని పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు చేసి నెలరోజులు పూర్తవుతున్నా..ముఖ్యమంత్రి మాత్రం దీని పైన స్పందించక పోవటం పైన సుజనా అసహనం వ్యక్తం చేసారు. ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని చెప్పారు. ఇక టీడీపీ హయాంలో కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందన్నారు. కేంద్రం హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలస్యం చేయడం వల్ల ప్రతీ సీజన్‌లో 10వేల కోట్లు నష్టం వస్తుందని వివరించారు. టెండర్లు మార్చడం వల్ల 5 రూపాయలు కూడా ఆదా చేయలేరని పేర్కొన్నారు. గోదావరి వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్నారు.

సీఎం చంద్రబాబు స్థాయిలో లేవు..ఆయన ఎమ్మెల్యేనే..
ముఖ్యమంత్రి జగన్ పైన వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి తొలి సారిగా చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం పాలనలో అయిదేళ్ల పాటు కాలయాపన కారణంగా పోలవరం ట్రాక్ తప్పిందని విమర్శించారు. తాజాగా చంద్రబాబు జమిలి ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందించారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదన్నారు. జమిలి ఎన్నికలు మాజీ సీఎం చంద్రబాబు స్థాయిలో లేవన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనన్నారు. సుజనా చౌదరితో పాటుగా బీజేపీలో చేరిన మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జమిలి ఎన్నికలు ఖాయమంటూ కడపలో వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలతోనే భవిష్యత్ ఉందని చెబుతూ..2023 లో జమిలి ఎన్నికలు జరిగి తీరుతాయంటూ చెప్పుకొచ్చారు. ఆయనతో పాటే అదే పార్టీలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సుజనా చౌదరి ఆ విషయం తనకు తెలియదని చెబుతూనే..చంద్రబాబు కు జమిలి ఎన్నికలు మాజీ సీఎం స్థాయిలో లేవని వ్యాఖ్యానించారు. దీనికి కొసమెరుపుగా చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే మాత్రమేనంటూ తేల్చేసారు. దీని ద్వారా బీజేపీ నాయకత్వం తాను చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్నానే అభిప్రాయం తొలిగించేందుకే ఈ రకంగా వ్యాఖ్యలు చేసారా అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications