విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన రోగులు!
సాగర తీరం విశాఖ నగరం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక వెంకోజీపాలెం మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. భయనం సెల్లార్ ఉన్న యూపీఎస్ బ్యాటరీల యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం క్షణాల్లో కమ్మేసింది. ఈ ప్రమాదం అర్థరాత్రి సమయంలో జరగడంతో ఆస్పత్రిలోని రోగులు, బంధువులు పరుగులు తీశారు. కొంత సమయం అక్కడ భయానక వాతావరణం నెలకొంది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా, మరి కొంతమందిని బిల్డింగ్ అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుముట్టడంతో మెడికవర్ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్‌లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దట్టమైన పొగలు ఆస్పత్రి వెలుపల చుట్టుముట్టడంతో జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్‌ను అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దాదాపు 5 గంటలు శ్రమించి యూపీఎస్ బ్యాటరీ ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

తరచుగా ప్రమాదాలు..
పొగను నియంత్రించిన తర్వాత రోగులను తరలించాల్సిన అవసరం లేదని రెస్క్యూ టీమ్ స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో విశాఖ నగరంలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు తరచుగా జరగుతుండడంతో నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జగదాంబ సెంటర్‌లోని ఇండస్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో పలువురు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. ఇప్పటికైనా అధికారులు ఆస్పత్రుల వద్ద భద్రతా ప్రమాణాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications