వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరిన కేసులో ఆ ముగ్గురు అరెస్ట్..!!
విశాఖపట్నం: విశాఖపట్నంలో కలకలం చోటు చేసుకుంది. రాష్ట్రానికి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎక్స్‌ప్రెస్ కోచ్ అద్దాలు పగిలాయి. మెయింటెనెన్స్ కోసం ఈ రైలును తీసుకెళ్తోన్న సమయంలో కంచరపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. మొదట్లో ఇది తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ- అది దాన్ని ప్రీ పోన్ చేశారు అధికారులు. ఈ నెల 15వ తేదీ నాడే ప్రధాని మోదీ ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. దేశ రాజధాని నుంచి ఆయన వర్చువల్ గా జెండా ఊపి ఈ రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొస్తారు.

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టాల్సిన ఎక్స్‌ప్రెస్ ఇది. ఈ రైలు బుధవారమే విశాఖపట్నానికి చేరుకుంది. రోజువారీ మెయింటెనెన్స్ కోసం షెడ్ కు తరలించారు అధికారులు. కంచరపాలెం మీదుగా వెళ్తోన్న సమయంలో దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందిన వెంటనే విశాఖపట్నం డివిజినల్ రైల్వే మేనేజర్.. ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జనరల్ రైల్వే పోలీస్ అధికారులు రైలును పరిశీలించారు. ఎక్కడి నుంచి రాళ్లు పడ్డాయనే విషయంపై దర్యాప్తు మొదలు పెట్టారు. ముగ్గురు స్థానికులు రైలుపై రాళ్లు రువ్వినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని దిలీప్, శంకర్, చందుగా గుర్తించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంస నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో వారు రాళ్లు విసిరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ ఉదయం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు కొత్త కిటికీ అద్దాలను అమర్చారు అధికారులు. డివిజినల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ ఈ పనులను పర్యవేక్షించారు. పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చారు. వాటిని చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించారు.












Click it and Unblock the Notifications